టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ప్రధాన పాత్రలో, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యభరిత చిత్రం ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతోంది. ఇప్పటివరకు ప్రేమలో గెలిచాం.. పెళ్లి తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్న ఓ జంట చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. ‘రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవైనా జరిగినా.. ఆ గొడవ వల్ల నా పరువు పోయినా.. గుర్తుపెట్టుకో నీ బతుకు నా చేతిలో చేతబడి బొమ్మేరోయ్’ అంటూ హీరో తండ్రి డైలాగ్‌తో ఆసక్తికరంగా టీజర్ ఉంది. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత రుద్రదేవ్ మాదిరెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ దుర్గ నరేష్ స్టోరీ చెప్తుంటే ఫస్టాఫ్ నెరేషన్‌లో ఆయన ప్యాషన్, హార్డ్ వర్క్ అర్థమయ్యాయి. గడ్డం రాకేష్ రెడ్డి లాంటి పార్ట్‌నర్ ఉంటే సినిమా ఈజీగా చేయొచ్చు. ఇండస్ట్రీలో నేను ఎవరికీ తెలీదు. ఆయనే మొత్తం నడిపించారు. తిరువీర్ అమేజింగ్ ఆర్టిస్ట్. ఈటీవీ విన్ నుంచి సాయి బాగా సపోర్ట్ చేశారు.క్రియేటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ వల్లే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చింది. సినిమాను అందరూ చూసి ఆదరించండి అని కోరారు.
నిర్మాత గడ్డం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈటీవీ విన్‌తో ఇది నా సెకెండ్ ప్రాజెక్ట్. సాయికి, నితిన్ కి థ్యాంక్యూ వెరీమచ్. బాపినీడుకి స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాలో రాశి, అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు ఇలా చాలా మంచి కాస్ట్ ఉంది. అప్పట్లో జంధ్యాల సినిమాలో చూసినట్లు ఈ సినిమాలో నటీనటులను చూస్తారు. థియేటర్లలో నవ్వులు గ్యారెంటీ సినిమా ఇది. ఈ సినిమా చాలా బాగా ఆడితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తాం. మా సంస్థ నుంచి కొత్త వాళ్లనే ఎంకరేజ్ చేస్తాం అని తెలిపారు. మూవీ డైరెక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ రామోజీ రావుకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. నా జర్నీ 2013లో మొదలైంది. అప్పటి నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నా. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఏజ్ మాత్రమే. నా లైఫ్ దీని మీద పెట్టేశాను. నాకు ఎక్కడ ఇబ్బంది కలిగినా సినిమా ఆపుకుంటూనే వచ్చా. సినిమా ఫెయిల్యూర్ అవుతుందనే చోట నేను చేయలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్‌తోనే నిలబడి ఉన్నా. ఈ రోజు గ్యారెంటీ ఇస్తున్నా.. పాపం ప్రతాప్.. మామూలు సినిమా అవదు. రాసి పెట్టుకోండి.. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. నిర్మాతలు ఫ్రీడం ఇవ్వడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మనం కమర్షియల్ బడ్జెట్‌లో పడి, ఒరిజినల్ సినిమాలను, కథలను వదిలేస్తున్న ఈ టైమ్‌లో నేను మళ్లీ ప్రపంచాన్ని తీసుకురావాలని ప్రయత్నించాను. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పారు.హీరో తిరువీర్ మాట్లాడుతూ…‘‘నాకు చిన్నప్పుడు సినిమాల గురించి తెలిసింది ఈటీవీ ద్వారానే. ఈరోజు ఈటీవీ విన్‌తో సినిమా చేశా. గతంలోనే వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేను చేయాల్సింది. కానీ అప్పట్లో థియేటర్ సినిమాలే చేయాలని నాకు ఉండింది. ఈ రోజు నా లైనప్ చూస్తే నా నెక్ట్స్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది. ధైర్యంగా ఉండొచ్చు అనిపిస్తోంది. చాలా షార్ట్ పిరియడ్‌లో ఈటీవీ విన్ మంచి పేరు తెచ్చుకుంది. నరేష్ ఈ కథ పట్టుకుని చాలా తిరిగాడు. అతని కోసమే ఈ సినిమా చేయాలనిపించింది. నరేష్ ఏం చెప్పాడే అది విని ఈ సినిమా చేసుకుంటూ వెళ్లా. నా సినిమాలకు ప్రశంసలు మాత్రమే కాదు డబ్బులు కూడా వస్తాయని ఈ సినిమా నిరూపిస్తుంది. ఏప్రిల్ 17న మీకు టీజర్‌ను మించిన ఫన్ ఇస్తుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే సినిమా. థియేటర్లలో కలుద్దాం అని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల,యాక్టర్ ప్రసాద్ బెహరా, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ పాల్గొన్నారు.



