Pathways to Overseas Employment Through TANCOM: Minister Vivek:
జర్మనీలో లక్షల ఉద్యోగాలు… గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శం
మంచిర్యాల, ఏప్రిల్ 15:
రాష్ట్ర యువతకు విదేశాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జర్మనీ దేశంలో ప్రతి ఏడాది సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం 90 వేల వీసాలు జారీ చేయడానికి ఆ దేశం ముందుకు వచ్చిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ద్వారా ప్రతి సంవత్సరం 25 వేల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. TOMCOM ద్వారా నాలుగు నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. చెన్నూరు లో మంత్రి మీడియా తో సమావేశంమయ్యారు.
ప్రైవేటు ఏజెన్సీల మాయమాటలకు లోనై మోసపోవద్దని యువతకు మంత్రి హెచ్చరించారు. విదేశాల్లో భారతీయ యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా భారతీయులు అక్కడి చట్టాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేస్తారనే మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. జర్మనీలో ఉద్యోగాల ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశం ఉందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ దిశగా ముందుకు సాగుతోందని, ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని మంత్రి తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువత TOMCOM అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.


