Affordable Quality Healthcare at NIMS for Poor and Middle-Class People: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) (నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజాగుట్టలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. 1961లో నిర్మించబడిన ఈ ఆసుపత్రికి స్థాపకుడైన హైదరాబాదు నిజాం పేరును పెట్టారు. దీనిని యువరాణి దుర్రేషేవర్ ప్రారంభించింది.
నిమ్స్ అసలు పేరు బొక్కల దవాఖాన. నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిని 1964, డిసెంబరు 22న అప్పటి కేంద్ర రైల్వేమంత్రి ఎస్.కె. పాటిల్ ప్రారంభించాడు. ఆస్పత్రి తొలి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ఎం. రంగారెడ్డి, ఆర్థోపెడిక్స్ కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రి నిర్మించేలా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను ఒప్పించి, నిజాం ట్రస్ట్ కింద స్థలం కేటాయింపు చేయించి, దాని నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించాడు. నిజాం ఛారిటబుల్ ట్రస్ట్ ఈ అసుపత్రిని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించే వరకు డాక్టర్ రంగారెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు
నిమ్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపబడి పాలక మండలి, కార్యనిర్వాహక మండలి, డైరెక్టర్, ఇతర చట్టబద్దమైన సంస్థల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. గత 20 సంవత్సరాలుగా ప్రతినెల “ది క్లినికల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్” పత్రికను ప్రచురిస్తుంది.ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తోంది. 2014-15లో 185 కోట్లు, 2022లో 242 కోట్లు, 2023లో 290 కోట్లు కేటాయింపులు జరిగాయి
కోర్సులు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తించబడిన 40 విభాగాలలో ఎండి, ఎంఎస్, ఎం.సిహెచ్, డి.ఎం, పిహెచ్.డి కోర్సులను నిర్వహించి, ధృవపత్రాలను కూడా ఇస్తుంది. ఇవేకాకుండా పారామెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు ఇందులో ఉన్నాయి.
సదుపాయాలు
2014 నాటికి 900 పడకలు ఉండగా, వాటిని 1489కి పెంచారు. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా 2022 చివరినాటికి 264కు పెంచారు. గతంలో రెసిడెంట్ డాక్టర్లు ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తోపాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లు, ఇతర సౌకర్యాలను 2022 జూన్ 23న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సీఎండీ వెంకట్ జాస్తి పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు
డైరెక్టర్లు
ఆసుపత్రి నిర్వహణకు డైరెక్టర్లను నియమించారు.
కాకర్ల సుబ్బారావు (1985-1990)
ఐ. దినకర్ (ఇన్‌ఛార్జి, 1990)
డి. రాజా రెడ్డి (1990-1993)
బి.వి. రామారావు (ఇన్‌ఛార్జి, 1993)
ఐ. దినకర్ (1993-1996)
కె. ఈశ్వర ప్రసాద్ (ఇన్‌ఛార్జి, 1996-1997)
వి.ఎస్ భాస్కర్ (1997)
కాకర్ల సుబ్బారావు (1997-2004)
పి. రాజగోపాల్ (2004)
ప్రసాద రావు (2004-2010)
పివి నరసింహారావు రమేష్ (2010)
ప్రశాంత మహాపాత్ర (2010–2011)
ధర్మ రక్షక్ (2011–2013)
అజయ్ సాహ్నీ (ఇన్‌ఛార్జి, 2013)
లావు నరేంద్రనాథ్ (2013–2015)
కె. మనోహర్ (2015-ప్రస్తుతం)


