Thimmarajupalli tv Ratiing : 2/5
Totally andhra based movie thimmarajupalli tv : మార్కెట్ లో ఏ కొత్త వస్తువు వచ్చినా … దాని చుట్టూ ప్రజల ఎమోషన్స్ దాగి ఉంటాయి. మార్కెట్ లోకి వచ్చిన కొత్త వస్తువు అందరికి ఉపయోగపడే వస్తువు అయితే దాని చుట్టూ అన్ని ప్రాంతాల వారి ఎమోషన్స్ ఇమిడి ఉంటాయి. కానీ ”తిమ్మరాజు పల్లి టివి”అనే సినిమా ఫక్తు ఆంధ్ర ప్రాంత ప్రజల ఎమోషన్స్ తో ముడిపెట్టి తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాను ఫక్తు ఆంధ్ర సినిమాగా అభివర్ణించవచ్చు. ఇక్కడ సినిమా పేరు కూడా పూర్తిగా ఆంధ్రప్రాంతంలోని పేరే. కాబట్టి కథ, కథలోని ప్రతి క్యారెక్టర్ కూడా ఆంధ్రప్రాంతానికి చెందినవె. అందుకే తిమ్మరాజుపల్లి టివి అనే సినిమాను పూర్తిగా ఆంధ్ర ప్రజల కోణంలో మాత్రమే చూడాలి. అంతేకాదు ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారిన నటుడు కిరణ్ అబ్బవరం తిమ్మరాజు పల్లి టివి అనే సినిమాలో సుమారు యాభై మంది నూతన నటీనటులను పరిచయం చేశారు. వీరిలో అయిదు శాతం మంది కూడా తెలంగాణకు చెందిన నటీనటులు లేరు. కానీ ఈ ఆంధ్ర సినిమాను తెలంగాణ (సినిమా మార్కెట్ భాషలో నైజాం ఏరియా)లో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు తెలంగాణ థియేటర్లలో పెద్దగా గిరాకీ ఏమి లేదు.
కిరణ్ సబ్బవరం అనే నటుడు నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థపై మునిరాజు అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టివి. ప్రజల ముందుకు కొత్తగా టెలివిజన్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతున్న కాలంలో ఎవరో ఊరి జమీందారు లాంటివారు, డబ్బున్న వాళ్ల్లు ఒకరిద్దరు మాత్రమే టివి కొనుక్కునే స్థోమత ఉండేది. ఆ టీవీని చూడటానికి, అందులో వచ్చే కార్యక్రమాలను చూడటానికి సరిగ్గా సమయం చూసుకుని మరి , ఆ సమయానికి పనులన్నీ పక్కన పెట్టి టివి ముందు కూర్చునే వాళ్ళు.
గ్రామీణ ప్రాంతాల్లో, టెలివిజన్ కలిగి ఉండటం ఒక హోదాకు చిహ్నంగా ఉన్న కాలాన్ని మనం సులభంగా మరచిపోతాం. ఆ రోజుల్లో, టీవీ చూడటానికి ఊరంతా ఒకే ఇంట్లో గుమిగూడేవారు.
కథ
ఈ కథ 1990వ దశకంలో తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. సతీష్ (సాయి తేజ్) మరియు శారద (వేద జలంధర్) ప్రేమించుకుంటారు. శివరాత్రి పండుగ సమయంలో, గ్రామస్తులు కలిసి సినిమాలు చూడటానికి ఒక టీవీని అద్దెకు తీసుకుంటారు. ఎల్లమ్మ (స్వాతి కళిమిరెడ్డి)ను పెళ్లి చేసుకున్న తర్వాత, తన హోదాను చాటుకోవాలనే ఉద్దేశంతో రాజప్ప (ప్రదీప్ కొట్టే) ఒక టీవీని కొని తన ఇంట్లో పెట్టుకుంటాడు. త్వరలోనే, అతని ఇల్లు మొత్తం గ్రామానికి కేంద్రంగా మారుతుంది, ప్రజలు ప్రతిరోజూ టీవీ షోలు , సినిమాలు చూడటానికి అక్కడ గుమిగూడతారు.
అయితే, టీవీ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కథ మలుపు తిరుగుతుంది. గ్రామ పెద్దలు సతీష్‌పై అనుమానం పడి, దొంగతనం చేశాడని ఆరోపిస్తారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్న సతీష్, రెండు వారాల్లో అసలు దోషిని పట్టుకుంటానని శపథం చేస్తాడు. ఆ తర్వాత అతను నిజాన్ని వెలికితీయడానికి చేసే అన్వేషణ, అందులో అతను తనపై ఉన్న నిందను తొలగించుకుని శారదను పెళ్లి చేసుకోవడంతో కథ సుఖంతమవుతుంది. మొదటి భాగం ప్రధానంగా గ్రామీణ నేపథ్యాన్ని, అక్కడి ప్రజలను, వారి మధ్య సంబంధాలను, అలాగే పండుగల సమయంలోని సామూహిక భావనను ఆవిష్కరిస్తుంది.కానీ చాలా చోట్ల సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. ఇంట్రవెల్ తరువాత కూడా కథ నడిపిన విధానాన్ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉండాల్సింది. రాజప్ప ఇంట్లో టీవీ అమర్చిన తర్వాత కథనం ఊపందుకుంటుంది. అతని హోదా పెరిగేకొద్దీ, కొంతమంది గ్రామస్తులలో అసూయ రగులుతుంది, అది చివరికి దొంగతనానికి దారితీస్తుంది. దర్శకుడు కనిపించకుండా పోయిన టీవీ చుట్టూ సస్పెన్స్‌ను కొనసాగిస్తూ, క్లైమాక్స్ వరకు వేగాన్ని నిలబెట్టాడు. క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా చిత్రీకరించాడు.
పాత జ్ఞ్యాపకాలను గుర్తు చెయ్యడం మంచిదే కానీ ఆ పాత జ్ఞ్యాపకాలు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కు వర్తిస్తున్నాయా? లేదా అనే విషయాన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.
సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కలిమిరెడ్డి, అమ్మ రమేష్, మాధవి ప్రసాద్, తేజ విహాన్, సత్యనారాయణ, గణేష్, అన్షుమన్, తదితరులు అంత కొత్త వారే అయినా వీళ్ళ నటన ప్రవలేదనిపించింది. సంగీతం కూడా ప్రవలేదనిపిస్తుంది. ఈ సినిమాకు కిరణ్ ఆబ్బవరం పెట్టిన ఖర్చు కూడా పెద్దగా ఏమిలేదు. అంత కొత్తవాళ్లే కాబట్టి రెమ్యునరేషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేదు. కాబట్టి నిర్మాత అతి తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా తీశారని అర్థమవుతోంది.
ఎం. లక్ష్మి నారాయణ


