Grand Youth Festival 2026 హైదరాబాద్ :
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో యూత్ ఫర్ ఇన్‌క్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీ (YISS) ఆధ్వర్యంలో “సే నో టు డ్రగ్స్! – ఆనందభరితమైన, సంతోషకరమైన క్యాంపస్ !” అనే ప్రధాన అంశంతో YISS యూత్ ఫెస్టివల్ 2026 ను 2026 ఏప్రిల్ 8న రాత్రి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే హానిపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన మరియు సానుకూల జీవనశైలిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మరియు విద్యా ప్రతిభాశాలి డా. నైనా జైస్వాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ముందుకు సాగాలని, విజయవంతమైన జీవితానికి ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరమని ఆమె సూచించారు.
గౌరవ అతిథిగా హాజరైన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబాల స్థిరత్వాన్ని మరియు సమాజంలోని శాంతి, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తాయని ఆయన స్పష్టంచేశారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోవాలని, సానుకూల ఆలోచనలు, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లాలని సూచించారు. అదేవిధంగా, ఒత్తిడులను ఎదుర్కొనే సమయంలో తప్పు మార్గాలను ఆశ్రయించకుండా, సరైన మార్గదర్శకత్వాన్ని పొందాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా YISS వ్యవస్థాపకుడు మరియు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జీవితాన్ని ఆనందంగా గడపడానికి అనేక సృజనాత్మక మార్గాలు ఉన్నాయని, మంచి అభిరుచులు, సానుకూల దృక్పథం ద్వారా సంతోషకరమైన జీవితం సాధ్యమని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా పాటలు, నృత్యాలు మరియు Mr, Miss & Mx UoH పోటీలు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కామాఖ్య సినిమా బృందం – దర్శకుడు అభినయ కృష్ణ, నటులు శరణ్య ప్రదీప్, సందీప్ సాండెల్, హీరో విరాట్ కర్ణ కూడా పాల్గొని, విద్యార్థులతో మమేకమై మత్తు వ్యతిరేక సందేశాన్ని బలపరిచారు.
ఈ కార్యక్రమాన్ని YISS కన్వీనర్ లక్కీ ఆధ్వర్యంలో, అధ్యక్షురాలు మేఘనా, సభ్యులు శివ యాదవ్, ప్రీతి, లిన్సీ, ఐశ్వర్య, యశోద్, ప్రవీణ్, బన్ని తదితరులు సమర్థంగా నిర్వహించారు.
YISS యూత్ ఫెస్టివల్ 2026 ద్వారా విద్యార్థి సమాజం మత్తు రహిత, ఆరోగ్యకరమైన, సమగ్ర క్యాంపస్ నిర్మాణానికి తమ కట్టుబాటును మరోసారి వ్యక్తం చేసింది.


